ʹఅటవీ సంపద ఆదివాసులదేʹ - మన్యంలో తీవ్రమైన మావోయిస్టుల పోరాటం
అటవీ సంపద పై ఆదివాసులదే అధికారం అంటూ మన్యంలో మావోయిస్టులు పోరాటం ఉదృతం చేశారు. విశాఖపట్నం మన్యంలో ఒక వైపు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మావోయిస్టులు మరో వైపు కాఫీ తోటలను ఆదివాసుల పరం చేయాలంటూ ఉద్యమం ప్రారంభించారు. గూడెంకొత్తవీధి మండలంలోని ఆర్వీనగర్, లంక పాకల తదితర ప్రాంతాల్లో ఉన్న కాఫీ తోటలపై ఆదివాసులకే హక్కు ఉండాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న మావోయిస్టులు ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ సాగుతున్న ఉద్యమంలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలోతో సహా ప్రతి ఒక్కరినీ కదిలించడంలో సఫలం అయిన అన్నలు ఇప్పుడు అటవీ సంపదంతా ఆదివాసులదేనంటూ ఉదృతం చేసిన ఉద్యమంలో కూడా ఆదివాసులందరినీ కలుపుక రావడంలో విజయం సాధించినట్టు కనపడుతోంది. శనివారం ఉదయం దాదాపు 300 ఆదివాసులు చాపరాతిపాలెం ప్రాంతం నుండి నలుగురు ఏపీఎఫ్ డీసీ ఉద్యోగులను పట్టుకెళ్ళి సాయంత్రానికి వదిలేశారు. కాఫీతోటలపై ఆదివాసులకు మాత్రమే హక్కు ఉండాలని, తోటల జోలికి ఏపీఎఫ్ డీసీ అధికారులు రావద్దని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉద్యోగులను హెచ్చరించినట్టు తెలిసింది. మరో వైపు బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలనే డిమాండ్ తో తెలుగుదేశం నాయకులను పట్టుకెళ్ళి పది రోజుల తర్వాత వదిలేసి కొద్దిరోజులు కూడా గడవకముందే మళ్ళీ ఉద్యోగులను పట్టుకెళ్ళడం పోలీసులకు సవాల్ గా మారింది. పోలీసులు మన్యంలో కూంబింగ్ తీవ్రతరం చేశారు. అయినప్పటికీ అటు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఇటు కాఫీ తోటలపై హక్కు కోసం గ్రామాల్లో ఆదివాసులు సభలు సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు.
No comments:
Post a Comment