నాడు ఎయిర్ హోస్టెస్.. నేడు రెడ్ క్వీన్!
12-05-2016 01:52:01
- అంతర్జాతీయ స్మగ్లర్ లక్ష్మణ్ భార్య సంగీత ఎర్ర దందా
- అతడిచ్చిన సమాచారంతోనే కోల్‌కతాలో అరెస్టు
- 18న చిత్తూరు కోర్టులో హాజరు
చిత్తూరు టౌన్, మే 11: వృత్తి రీత్యా ఆమె ఎయిర్‌హోస్టెస్! మోడల్‌గా కొన్ని ఆల్బమ్‌లు చేసిన అనుభవమూ ఉంది! కానీ.. ఆమె ప్రవృత్తి మాత్రం ఎర్రచందనం అక్రమ రవాణా!! గ్లామర్ ఫీల్డ్‌లో ఎంత కష్టపడితే మాత్రం కోట్లు సంపాదించగలమనుకుందో ఏమో.. తనకు ‘సంపాదన’ మార్గం చూపిన ఓ ఎర్రచందనం స్మగ్లర్‌తో చేయికలిపింది. అతడి రెండో భార్య అయింది. కోల్‌కతాలో ఉంటూ అతడి ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యతా తీసుకుంది!! ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్ రెండో భార్య సంగీత కథ ఇది. ఈ అంతర్జాతీయ మహిళా స్మగ్లర్‌ను ఎట్టకేలకు చిత్తూరుజిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 18న ఆమెను చిత్తూరు కోర్టుకు తీసుకురానున్నారు. చెన్నై సమీపంలోని మందాడి ప్రాంతానికి చెందిన లక్ష్మణ్.. తిరుపతి శేషాచలం నుంచి ఎర్రచందనం దుంగలను అక్రమంగా దేశ, విదేశాలకు విమానాలు, ఓడల ద్వారా తరలించేవాడు. విలాసవంతమైన జీవితం అంటే ఇష్టపడే అతను.. 2013 నుంచి విమానంలో తరచూ కలకత్తాకు వెళ్లివస్తుండగా ఎయిర్ హోస్టెస్ సంగీతా చటర్జీతో పరిచయమైంది. కోల్‌కతాకు చెందిన సంగీత మోడల్‌గా కూడా పనిచేసేది. కొన్ని ఆల్బమ్‌లు కూడా చేసింది. మొత్తమ్మీద ఆమె పరిచయాన్ని లక్ష్మణ్ తన ఎర్రచందనం అక్రమ వ్యాపారానికి వినియోగించుకున్నాడు. స్మగ్లింగ్ ద్వారా వచ్చే నగదును తన బావమరిది గురుస్వామి ద్వారా సంగీతకు పంపి ఆమె చేత కోల్‌కతాలోని బ్యాంకుల్లో జమ చేయించేవాడు. లక్ష్మణ్‌కు అప్పటికే రీటా అనే మహిళతో వివాహం అయినప్పటికీ.. సంగీతను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆమె సైతం అతడి సాహచర్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి తెలుసుకుని అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుంది. ఈ క్రమంలో ఆమె ఎర్రచందనం అక్రమ రవాణా ద్వారా దాదాపుగా రూ.10 కోట్లకు పైగానే సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు.
నిండ్ర పోలీసులు 2014లో లక్ష్మణ్‌ను అరెస్టుచేసి పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు (అప్పటికే అతనిపై 23 కేసులున్నాయి). అనంతరం బెయిల్‌పై వచ్చిన లక్ష్మణ్.. ఈ ఏడాది ఫిబ్రవరి 16న మళ్లీ మదనపల్లె పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం మదనపల్లె సబ్‌జైలులో ఉన్నాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంగీత చటర్జీని పట్టుకోవడానికి వారం కిందట కోల్‌కతా వెళ్లారు. కానీ.. ఆమె ప్రైవేటు సెక్యూరిటీ, న్యాయవాదులు అడ్డుకోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. రెండోసారి అరెస్టు, సెర్చ్ వారెంట్లతో కోల్‌కతా వెళ్లి అక్కడి పోలీసు కమిషనర్‌తో చర్చించి.. చిత్తూరు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆమె ఇంటిలో గుర్తించిన బ్యాంకు ఖాతాలు, లాకర్లలో ఉన్న నగదు, ఆభరణాలను ఫ్రీజ్ చేయాలంటూ చిత్తూరు పోలీసులు సంబంధిత అధికారులను రాతపూర్వకంగా కోరడంతో వారు ఫ్రీజ్ చేశారు. అయితే, సంగీత తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్ మేరకు ఆమెకు అక్కడి న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే చిత్తూరు న్యాయమూర్తి ఇచ్చిన అరెస్టు వారంట్‌ను అక్కడి న్యాయమూర్తికి సమర్పించడంతో ఈ నెల 18న చిత్తూరు కోర్టులో సంగీత హాజరుకావాలంటూ కోల్‌కతా కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, సంగీతపై చిత్తూరు పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. వీటికి సంబంధించి ఈ నెల 18న చిత్తూరు కోర్టుకు సంగీత హాజరు కానున్నారు.
No comments:
Post a Comment