Tuesday, 23 September 2014

తెరవని తలుపులు - కాశీభట్ల వేణుగోపాల్

తెరవని తలుపులు - కాశీభట్ల వేణుగోపాల్

Sreeram Kannan గత పద్నాలుగేళ్ళ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే గొప్పది అని కాకుండా బాగా నచ్చిందీ, ఆలోచింపజేసిందీ అనుకుంటే - నాకు నచ్చింది కాశీభట్ల వేణుగోపాల్ ' తెరవని తలుపులు


వేణుగోపాల్ ఈ నవల రాయకముందే ఆయన రాసిన ఘోష అనే కథల సంపుటి ఒకటి చదివాను. ఆయనవి ఇంక కొన్ని రచనలున్నా, పైన పేర్కొన్న దానితో బాగా కనెక్ట్ అవడం జరిగింది.

స్థూలంగా చెప్పాలంటే - " ఇంజినీరింగ్ పూర్తి చేసి విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న కొడుకు, కాలేజీ లో లెక్చరర్ గా పనిచేస్తున్న భార్య, వీరితో బాటు ఉంటున్న అత్తగారు. " తల్లి చిన్నప్పుడే చనిపోతే ఇంకో పెళ్ళి చేసుకుని సంసారాన్ని లాగిన తండ్రి. ఊళ్ళో కొన్ని ఎకరాల పొలం, తమ్ముడు, సవతి తల్లి మూలంగా ఓ చెల్లెలు. తమ్ముడూ, చెల్లీ ఒకే తల్లి పిల్లలు.

తనూ చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా ఇంజినీరే. పుట్టుకతో బ్రాహ్మణుడు. కాలేజీ లో చదువుతున్నప్పుడు రంగారావు తో పరిచయం మూలంగా నమ్మకాల సంకెళ్ళు ఒక్కొటొక్కటిగా తెగిపోతూ విముక్తి చెందాడా, నచ్చక కన్వీనియంట్ గా ఆచారాల్ని వదిలేశాడా అనేది తెలియదు. ఆ సంధిగ్ధత అతనికి ఉంటున్నట్లు మాత్రం కనపడదు. మందు, మాంసం అప్పటికే అలవాటైపోయి యజ్ఞోపవీతాన్ని త్యజించే ఉంటాడు బీ యీ పూర్తి చేసి ఎం యీ చదవడానికి తండ్రిని అనుమతి అడగడానికి వెళ్ళినప్పుడు. తమ్ముడేమో చిత్రకారుడవ్వాలని ఫైన్ ఆర్ట్స్ చదువుతూ ఉంటాడు. తండ్రీ కొడుకులు నవల్లో ఒకరినొకరు ఎదురైనప్పుడే వైరుధ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఒకరంటే ఒకరికి ప్రేమా ఆప్యాయతలూ ఉన్నట్లు కనబడదు. కొడుకు మాట విని తండ్రి వప్పుకోక పోగా తనకి పెళ్ళీ, ఊళ్ళో పెద్ద కాంట్రాక్టరు దగ్గర ఉద్యోగమూ అప్పటికే ఏర్పాటు చేసినట్ళు చెప్తాడు. ఇతనూ ఒప్పుకోడు- ఆస్థి అమ్మి తన వాటా తనకు ఇచ్చెయ్యమని అడుగుతాడు. తండ్రి ఇక అగ్గిమీద గుగ్గిలమై నానా మాటలూ, చేష్టలూ చేసి వీధిలోకొచ్చి గొడవకు దిగి ఒకరినొకరు సవాళ్ళు విసురుకునేదాకా వెళ్తుంది వ్యవహారం.

ఇక తను చదివిన ఊళ్ళోకి వచ్చి పడ్డ అతను ఇంటి వాటా యజమాని ఓ ప్రతిపాదన పెడుతుంది. ఆవిడ ఓ విధవరాలు. చిన్నప్పుడే వైధవ్యం కలిగినా చదువుకుని ప్రభుత్వోద్యోగం సంపాదించుకుని ఒక్కగానొక్క కూతుర్ని కూడా చదివించి ఆసరికి సెటిలైపోయి సంబంధాల కోసం వెతుకుతూ ఉండగా ఇతని పరిస్థితి తెలిసి శాఖలు వేరైనా పట్టించుకోకుండా తన కూతురితో పెళ్ళికి అడుగుతుంది. దానికి ఉపకారంగా తనని ఎం యీ చదివిస్తానంటుంది. ఇతని స్నేహితుడూ ఇతన్ని ఒప్పిస్తాడు. ఇతనూ వప్పుకుంటాడు జీవిత ధ్యేయం నెరవేరుతూ ఉన్నందుకు.

చదువు, పెళ్ళి పూర్తి అవడం, ప్రభుత్వ రోడ్డు భవనాలు శాఖలో ఉద్యోగం, అంచెలంచెలుగా ఎదుగుతూ పెద్ద స్థితికి చేరుకోవడం. ఎదుగుదలలో భాగంగా లంచాలు, అవినీతి, ముఖ్యంగా తాగుడు, వైవాహిక జీవితంలో సర్దుబాట్లు చేసుకోలేక తనను తాను మౌల్డ్ చేసుకోలేక తన వారికి ( తండ్రి, తమ్ముడు, సవతి తల్లీ, చెల్లెలు ) కాల క్రమేణా దూరమవుతూ తనకి తాను దూరమౌతూ తనవారంటూ ఎవరూ లేని నమ్మే ఒక రకమైన స్థితికి మెల్లి మెల్లిగా చేరుకుంటూ ఉంటాడు. మనోవేదనలనుండి తప్పించుకోవడానికి తాగుడు, దానికి అత్తగారి వ్యతిరేకత, కూతుర్ని ఎగ దోలడం, గౌరవం ఇవ్వని కొడుకు, ఆత్మ సంతృప్తి ఇవ్వని అవినీతి సంపాదన, ఎవరితోనూ మనస్పూర్తిగా కలవలేని, మనసు తెరచి మాట్లాడే తోడు దొరకని, తానే అందర్నీ దూరంగా పెడుతూ, దూరం జరుగుతూ ఉండే ఒకానొక స్థితిలో, ఎడతెగని స్మోకింగూ, తాగుడు మూలంగా కలిగిన విపరీతమైన కాళ్ళనెప్పులతో బాధపడుతూ ఉంటాడు. కొడుకు విదేశాలకు వెళ్ళడానికి అత్తగారు తన కూతుర్ని తండ్రి ఆస్థిలో వాటా అడగమని పోరు పెట్టే సంధర్భంలో కథ నిజంగా మొదలవుతుంది.

ఆఫీసుకు ఫోనొస్తుంది తండ్రి చరమాంకంలో ఉన్నాడని. వెళ్ళాలనిపించదు, వెళ్ళకుండా ఉండనూ లేడు. అతన్ని చూసి, మాట్లాడి ఏళ్ళయి ఉంటుంది అప్పటికే. తమ్ముడు తాను కావలసిన విధంగా కాక ఇంకో విధంగా కిరాణా షాపు పెట్టుకుని ఇద్దరు కూతుళ్ళని చదివిస్తూ ఆ ఊళ్ళోనే కాలక్షేపం చేస్తూ ఉంటాడు. తండ్రి తో పెద్దగా అనుబంధం లేదు. కాస్తైనా ఏదైనా ఉందంటే తమ్ముడితోనే. కొంత స్నేహంగా ఇతనుండేది తమ్ముడితోనే. శవ దహనానికి కార్లోనే వెళతాడు. ఇతరుల మాటల్ని లక్ష్యపెట్టడు. అన్నిటినీ ట్రాష్ అంటూ ఇతనేమీ కలుగజేసుకోడు. తమ్ముడి చేతిమీదుగానే అన్ని కర్మకాండలూ జరుగుతాయి. మాటల్లో అత్తగారు ఆస్థి గురించి, ఇతని వాటా గురించి వాకబు చేస్తే ఇతనికి కోపం వచ్చి అత్తగారినీ భార్యనూ నానా మాటలూ అంటాడు. తమ్ముడితో స్పష్టంగా చెప్పేస్తాడు ఆస్థిలో వాటా వద్దని. పవర్ ఆఫ్ అటార్నీ తమ్ముడిపేర రాసి, రిజిస్ట్రేషనూ పూర్తి చేసి తిరిగొచ్చేస్తాడు.


సత్తార్ అని ఓ కాంట్రాక్టర్. ఇతనికి సత్తార్ కీ మంచి అవగాహన. కాంట్రాక్టు రావడం నుంచి ఇతని వాటా ఇతనికి ముట్టే వరకూ. ఒక రోజు కాంట్రాక్టు పేమెంటు వచ్చినందుకు తన తోటలో పార్టీ ఏర్పాటు చేస్తాడు సత్తార్. దానికి ఇతన్నీ పిలుస్తాడు. ఇతనూ కుటుంబంతో వెళ్తాడు. అక్కడ ఎక్కువగా తాగి తలకు చిన్న గాయం చేసుకుంటాడు. తిరిగొచ్చాక మళ్ళీ సాధింపులు, తల్లీ కూతుళ్ళు తాగి జీవితాన్ని నాశనం చేస్తున్నాడని. ఆర్థికంగా ఏ లోటూ ఉండని సంసారం. కాకపోతే ఇతనికీ ఆ ఇంట్లోవాళ్ళకీ మొదట్నుంచీ ఎక్కడా కలవదు. కొంత సర్దుకున్నాక ఓ రోజు కాలి బొటనవేలికి పచ్చగా ఏదో కనిపిస్తే తన స్నేహితుడైన డాక్టరు దగ్గరకేళ్తే గాంగ్రీన్ అని బయటపడుతుంది. మోకాలి వరకూ తీసెయ్యక తప్పదు అని చెప్పి ఇతని భార్యనూ, అత్త్గారిని బాగా కోప్పడి వెళ్తాడు. డాక్టరు వెళ్ళిన వెంటనే మళ్ళీ రంధి మొదలు.

కొడుకు అమెరికా కు వెళ్ళేందుకు డబ్బుల్ని ఇతనే తన అవినీతి సంపాదనలోంచి కొంత ఇస్తాడు. అప్పటికి తల్లీ కూతుళ్ళు కొంత సర్దుకుంటారు. కొడుకు అమెరికా కు వెళ్ళాక ఇతని తమ్ముడు ఊళ్ళో పొలం అమ్మేసి ఇతని కొడుక్కి ఇతనికి తెలీకుండా పంపి ఓ ఉత్తరం రాస్తాడు. అది చదివిన కొడుకు నిజం (?) తెలుసుకుని తండ్రిని క్షమాపణలు అడుగుతూ తల్లినీ అమ్మమ్మనూ దూషిస్తూ ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం ఇతన్నేం కదిలించలేకపోతుంది. అప్పటికే అన్ని రకాల బంధాల్నుంచి దూరమైపోయుంటాడు.

ఇతని అసిస్టెంటు నారాయణ అని ఎమ్మే ఫిలాసఫీ చదివి పొట్టకూటికోసం ఉద్యోగం చేస్తూ ఉంటాడు. కథలో ఇతనికీ, నారాయణకూ మంచి సంబాషణలు ఉంటాయి. ఇతని పాత్ర తక్కువే కానీ కథలో ఇతనితో సాన్నిహిత్యం తో సాంత్వన పొందుతూ ఉంటాడు మన కథా నాయకుడు. గాంగ్రీన్ అని తెలిసాక, కాలు తీసెయ్యడం తప్పనిసరి అని తెలిసాక అంతర్మథనం మొదలౌతుంది. భార్యతో సేవలు చేయించుకోవడం ఇష్టం ఉండదు. ప్రేమ అనేది ఇతనిలో ఏ కోశానా ఉండదు. ఆమెలోనూ అంతే. " ఒకే చూరుకు వేళ్ళడుతున్న కాందిశీకుల్లా ఉన్నాం " అని ఇతను తన సంసారం గురించి అనే ఒక్క మాటలో మొత్త బాంధవ్యం బోధపడుతుంది. ఇంకెవరికీ భారం కాదలుచుకోడు. నిద్రమాత్రలు గుప్పెడు గుప్పెడుగా తీసుకుంటూ ఉండగా కథ ముగుస్తుంది.

పాత్రల సంబాషణలు, కథ ముందుకూ వెనక్కీ ఉత్తమ పురుషలో నడిచే పద్దతి, తనలో తాను, తననే తాను వ్యక్తీకరించుకుంటూ, పరిశీలకుడూ, పరిశీలించేదీ తానే అవుతూ, మనలోని భావాల్ని ఒక్కొటొక్కటిగా ఎలివేట్ చేస్తూ ఐడెంటిఫై చేస్తూ కథ నడిచే తీరు నిజంగా అద్భుతం. జిడ్డు కృష్ణమూర్తి భావాలకూ, ఇతని పాత్ర వ్యక్తీకరణకూ చాలా దగ్గరి సంబంధం ఉంటుందని అనిపిస్తుంది కొంత పరిచయం కృష్ణమూర్తి తత్వంతో సంబంధం ఉండే వాళ్ళకు.

చాలా మంచి కథ. చాలా సార్లు నాచేత చదివించిన కథ.

No comments:

Post a Comment