Wednesday, 19 August 2015

‘ఆంధ్రావాడివి... నీకిక్కడేం పని’’ అంటూ అవమానించారు:

‘‘ఆంధ్రావాడివి... నీకిక్కడేం పని’’ అంటూ అవమానించారు: రాజీవ్‌శర్మపై ఏపీ డీఐజీ ఫిర్యాదు

విభజన వివాదాల్లో తాజా అంకం
హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య విభజన వివాదాల్లో తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. తనను అవమానించారంటూ ఏపీ డీఐజీ ఒకరు ఏకంగా తెలంగాణ సీఎస్‌పైనే ఫిర్యాదు చేశారు. ఈ వివాదానికి మూల బిందువు హైదరాబాద్‌ శివార్లలోని హిమాయత్‌సాగర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడెమీ. అప్పాగా పిలిచే దీనిని, మూడు దశాబ్దాల కిందట ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇక్కడికి తరలించారు. సమైక్య రాష్ట్రంలో 23 జిల్లాల పోలీసులకూ ఇక్కడే శిక్షణ ఇచ్చేవారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పాను పదో షెడ్యూల్‌లో చేర్చారు. ఇరు రాష్ట్రాలూ పదేళ్లపాటు దీన్ని ఉపయోగించుకోవచ్చని చట్టంలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నాటికి ఏపీ కేడర్‌కు చెందిన అదనపు డీజీ మాలకొండయ్య అప్పాకు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన కొనసాగుతుండగానే, విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడెమీ పేరును తెలంగాణ పోలీస్‌ అకాడెమీగా మార్చి ఈశ్‌కుమార్‌ను డైరెక్టర్‌గా నియమించింది. అప్పాలో ఒక డీఐజీ స్థాయి పోస్టు ఉంది. విభజనకు పూర్వం నుంచి ఏపీ కేడర్‌కు చెందిన వెంకటేశ్వర్‌రావు ఆ పోస్టులో ఉన్నారు. అయితే, ఆయనను రిలీవ్‌ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం జూన్‌ 25వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. పరిమళ నూతన్‌ అనే అధికారిని ఆయన స్థానంలో నియమించింది. కానీ, తాను ఏపీ కేడర్‌కు చెందిన అధికారినని, తెలంగాణ ప్రభుత్వం తనను ఎలా రిలీవ్‌ చేస్తుందనే కారణంతో వెంకటేశ్వరరావు రిలీవ్‌ కాలేదు. తెలంగాణ అధికారికి చార్జి ఇవ్వడానికి నిరాకరించారు. అదే సమయంలో గత నెలలో పదో షెడ్యూలులోని సంస్థలపై సచివాలయంలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి అప్పా తరఫున వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఆ సమావేశంలో, ‘‘ఏమయ్యా... నువ్వెందుకు రిలీవ్‌ అవలేదు? ఆంధ్రా వాడివి నీకిక్కడేం పని? అని తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌ శర్మ నలుగురిలో కోప్పడ్డారు. పలువురు ఐఏఎస్‌ల ముందే నన్ను అవమానించారు’’ అని వెంకటేశ్వర్‌రావు ఏపీ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పా పదో షెడ్యూలులో ఉన్నందున.. ఇరు రాష్ట్రాల పోలీసులకూ అందులో శిక్షణ ఇచ్చే అవకాశం ఉన్నందున.. తానే కొనసాగుతానని సీ ఎస్‌కు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆగస్టు మూడో తేదీన వెంకటేశ్వరరావు పేరును అప్పా రికార్డుల నుంచి తొలగించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండా వందనానికి అప్పాకు వెళ్లిన వెంకటేశ్వరరావుతో.. మూడో తేదీనే రిలీవ్‌ చేసేశామని, ఇక్కడికి ఎందుకు వచ్చారని అడగడంతో ఆయనకు విషయం తెలిసింది. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని ఏపీ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఏపీ డీజీపీ రాముడిని కలిసి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని డీజీపీ కోరడంతో సదరు డీఐజీ వివరంగా రాసిచ్చారు. అనంతరం ఆయన ఇదే విషయాన్ని ఏపీ సీఎస్‌, గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అప్పాలోనూ, పోలీసు ఉన్నతాధికార వర్గాల్లోనూ ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆంధ్ర ప్రదేశ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ విషయంలోనూ తెలంగాణ పోలీసులు ఏకచ్ఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారని ఏపీ సీనియర్‌ ఐపీఎస్‌లు రాముడు దృష్టికి తెచ్చారు. వీటిపై ఆయన పలువురు ఉన్నతాధికారుల అభిప్రాయాలు కోరగా... ‘‘అప్పాతోపాటు ఎఫ్‌ఎస్‌ఎల్‌లో మన వాటా 58 శాతం తీసుకుందాం. పక్కనే ఏర్పాటు చేసుకుందాం’’ అనే సూచనలు వచ్చినట్టు తెలిసింది. దీంతో పరిష్కార మార్గాలపై రాముడు ప్రభుత్వ సలహాదారు గాంధీ, ఇతర అధికారులతో సమీక్షించినట్టు సమాచారం. కాగా ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎస్‌, ప్రభుత్వ వర్గాల స్పందన తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

No comments:

Post a Comment