- ప్యాకేజీ ఎంత కావాలో చెప్పాలంటున్న కేంద్ర సర్కారు
- బిహార్‌కన్నా రెండింతలు ఎక్కువే ఇవ్వాలంటున్న ఏపీ
- నేడు ఆర్థికశాఖతో సీఎం సమీక్ష
- ముసాయిదాకు తుది రూపుపై చర్చ
న్యూఢిల్లీ, ఆగస్టు18 (ఆంధ్రజ్యోతి): బిహార్ వంతు పూర్తయింది. ఇక ఏపీ వంతు తేలాల్సి ఉంది. ఊహకందనిరీతిలో బిహార్‌కు భారీ ఎత్తున రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించాల్సిన ప్యాకేజీపై దృష్టి సారించినట్లు సమాచారం. విభజన సమస్యలతో సతమతమవుతున్న ఏపీకి కచ్చితంగా బిహార్‌కన్నా మిన్నగానే ప్యాకేజీ అందుతుందని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో 20వ తేదీన ప్రధానితో భేటీ కానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. బిహార్‌తో ఏపీని పోల్చకుండా, ఏపీకి హోదాపై నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కోరనున్నారు. ముందుగా ప్యాకేజీ ఇవ్వాలని భావిస్తే, బిహార్‌కు ప్రకటించిన ప్యాకేజీ కన్నా భిన్నమైన, రెండింతలు ఎక్కువ ప్యాకేజీని ప్రకటించాలని మోదీకి విజ్ఞప్తి చేయనున్నారు. ఏపీ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా విభజన జరిగిన నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని పట్టుబట్టనున్నారు. బిహార్ ప్యాకేజీలో.. కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా రాష్ట్రానికి ఇచ్చే నిధులనూ కలిపేశారు. అలా కాకుండా 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన మొత్తాన్ని మినహాయించి ఉత్తరాఖండ్ మోడల్ ప్యాకేజీ, హోదాను కల్పించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిసింది. ప్రధానితో భేటీలో ప్యాకేజీపై సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చిన తర్వాత ప్రధాని స్వయంగా ఏపీకి వచ్చి ప్రకటన చేస్తారని సమాచారం. అక్టోబర్ 22వ తేదీన నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోదీ రానున్నారు. అప్పుడే ఏపీ ప్యాకేజీపై ప్రకటన చేసే అవకాశమున్నట్లు బీజేపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ప్యాకేజీకి సుముఖంగా ఉన్న కేంద్రం హోదా అంశంలో మాత్రం చంద్రబాబుకు నచ్చజెప్పాలని భావిస్తోంది. నీతి ఆయోగ్‌లో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని సీఎంల సబ్‌కమిటీ పరిశీలిస్తున్నదని, ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే హోదా అంశాన్ని తేల్చుతామని చంద్రబాబుకు నచ్చజెప్పాలని కేంద్రం భావిస్తోంది. అయితే, చౌహాన్ కమిటీ సిఫారసుతో సంబంధం లేకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చంద్రబాబు మోదీపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్శదర్శి పి.వి.రమేశ్ ఏపీ అవసరాలు, ప్యాకేజీలో చేర్చాల్సిన అంశాలపై కసరత్తు చేస్తున్నారు. ఆయన ఇప్పటికే ఢిల్లీకి రెండు మూడు సార్లు వచ్చి కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో భేటీ అయ్యారు. ప్యాకేజీపై రెండు ముసాయిదాలను సిద్ధం చేసినట్లు సమాచారం. బుధవారం సీఎం చంద్రబాబుతో పీవీ రమేశ్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్యాకేజీ ముసాయిదాపై చర్చించి తుది రూపు ఇవ్వనున్నారు. మరోవైపు కేంద్రం కూడా 14 నెలల కాలంలో శాఖలవారీగా ఏపీకి ఇచ్చిన నిధుల వివరాలను తయారు చేసే పనిలో నిమగ్నమైంది.
ఉత్తరాఖండ్ మోడలే కావాలి
ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్‌ను విభజించిన సమయంలో ఆ రాషా్ట్రనికి ఇచ్చిన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ లాంటిదే ఏపీకి ఇవ్వాలని చంద్రబాబు గట్టిగా కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిసింది. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదాతోపాటు ఐదు రకాల పారిశ్రామిక రాయితీలను కల్పించారు. రాయితీలన్నీ పదేళ్లపాటు అమలులో ఉంటాయని ప్రకటించారు. పరిశ్రమలకు 100 శాతం ఆదాయపన్ను మినహాయింపు, సెంట్రల్ ఎక్సైజ్ పన్ను మినహాయింపులతో పాటు...ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు పూర్తిగా సర్వీస్ ట్యాక్స్ మినహాయింపులను ఇచ్చారు. అంతేకాకుండా పరిశ్రమలకు ప్రతియేటా బీమా ప్రీమియంలను కూడా కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్ చేసింది. పరిశ్రమలు బ్యాంకుల్లో మూలధనం నిమిత్తం తీసుకున్న రుణాలకు 3శాతం వడ్డీని కూడా మాఫీ చేసింది. ఈ మినహాయింపులన్నిటినీ ఏపీకి కూడా వర్తింపజేయాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరనున్నారు. దీంతోపాటు ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ యథాతథంగా అమలు చేయాలని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు. హైదరాబాద్‌ను వదులుకోవడం వల్ల వచ్చిన నష్టాన్ని కూడా ప్యాకేజీలో చేర్చాలని డిమాండ్ చేయనున్నారు. అక్కడున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఏపీలో ఏర్పాటు చేయాలని, అలా కాని పక్షంలో ఏపీకి అందుకు తగ్గట్టుగా నష్టపరిహారం ఇవ్వాలని కోరనున్నారు. కాగా, ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పరిశ్రమలకు పన్నుల మినహాయింపులు ఇవ్వడం కష్టమని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 2016 ఏప్రిల్ నుంచి జీఎస్టీ చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుందని అప్పుడు దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉంటుందని, సర్వీస్ ట్యాక్స్‌లు, ఇతరట్యాక్స్‌లు ఏమీ ఉండవని కేంద్రం చెబుతోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు కేంద్రాన్ని ఎలా ఒప్పిస్తారో గురువారం తేలనుంది.
|
No comments:
Post a Comment