ఉయ్యాలవాడ నరసింహారెడ్డి |
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
|
జననం | ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
కర్నూలు జిల్లాలోని రూపనగుడి |
మరణం | 1847 ఫిబ్రవరి 22 |
మరణ కారణము | ఉరిశిక్ష |
ఇతర పేర్లు | ఉయ్యాలవాడ నరసింహారెడ్డి |
ప్రసిద్ధి | స్వాతంత్ర్య సమరయోధుడు |
భార్య / భర్త | ముగ్గురు భార్యలు. పెద్దభార్య సిద్దమ్మ |
పిల్లలు | దొర సుబ్బయ్య |
1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు
1847 ఫిబ్రవరి లో ఆయన మరణంతో ముగిసింది.
రాయలసీమలో రాయలకాలం నుండి పాళెగాండ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకడు.
కంపెనీ దొరతనము ఎదిరించి వీరమరణం పొందినాడు.
ప్రారంభ చరిత్ర[మార్చు]
18వ శతాబ్దపు తొలిదినాల్లో
రాయలసీమలో పాలెగాళ్ళ వ్యవస్థ ఉండేది.
కడప జిల్లాలోనే 80 మంది పాలెగాళ్ళుండేవారు.
నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిషు వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు
బ్రిటిషు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిషు ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది.
ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి
కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలెగాడు గా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు,
నొస్సంజమీదారు అయిన చెంచుమల్ల జయరామిరెడ్డి నిస్సంతు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల, 10 అణాల, 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన, జయరామిరెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దుచేసింది బ్రిటిషు ప్రభుత్వం.
నరసింహారెడ్డి
కర్నూలు జిల్లాలోని
రూపనగుడి గ్రామములో జన్మించి, ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాధల వలన తెలుస్తున్నది. ఈయన కడప, కర్నూలు,
అనంతపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ,
ఉప్పులూరు,
గుళ్లదుర్తి,
కొత్తకోట మొదలైన గ్రామాలలో ఈయన నిర్మించిన కోటలు, నగరులు ఈనాటికీ ఉన్నాయి.
నరసింహారెడ్డి తల్లి ఉయ్యాలవాడ నగరికాపు అయిన పెదమల్లారెడ్డి రెండవ భార్య. ఈమె నొస్సం జమేదారు చెంచుమల్ల జయరామిరెడ్డి చిన్నకూతురు. నరసింహా రెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సిద్దమ్మ వలన కొడుకు దొర సుబ్బయ్య జన్మించాడు. రెండవ భార్య వలన ఒక కూతురు, మూడవ భార్య వలన ఇద్దరు కుమారులు జన్మించారు.
తిరుగుబాటు ప్రారంభం[మార్చు]
నరసింహారెడ్డి సేన తమ ఫిరంగిలో వాడిన ఇనుప గుండు
1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి
కోయిలకుంట్ల ఖజానాకు పంపగా, అక్కడి తాసీల్దారు, ఆ వ్యక్తిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు రెడ్డి నాయకత్వంలో చేరారు.
వనపర్తి,
మునగాల,
జటప్రోలు,
పెనుగొండ,
అవుకు జమీందార్లు,
హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరినవారిలో ఉన్నారు.
1846 జూలై 10వ తేదీ రెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి,ఖజానాలోని 805 రూపాయల, 10 అణాల, 4 పైసలను దోచుకున్నాడు.
ప్రొద్దుటూరు సమీపంలోని
దువ్వూరు ఖజానాను కూడా దోచుకున్నాడు. బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టి ఇచ్చినవారికి వేయిరూపాయల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది.
తరువాత
జూలై 23న తేదీన కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి
గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్ధరాత్రి రెడ్డి, తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదుచేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు
కడప చేరాడు రెడ్డి.
1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని
పేరుసోమల వద్దగల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించి రెడ్డిని బంధించింది.
నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో ఔకు రాజు తమ్ముడొకడు.
[1]
కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు
1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిషు ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.
దొరవారి నరసిం హ్వ రెడ్డి!
నీ దొరతనము కూలిపోయె రాజా నరసిం హ్వ రెడ్డి! || దొర ||
రేనాటి సీమలోనా రెడ్డోళ్ళ కులములోనా
దొరవారీ వమిశానా ధీరుడే నరసిం హ్వ రెడ్డి || దొర ||
కొయిల్ కుంట్లా గుట్టలేంటా కుందేరూ వొడ్డులెంటా
గుర్రమెక్కీ నీవు వస్తే కుంపిణీకీ గుండె దిగులూ || దొర ||
కాలికీ సంకెండ్లు వేసీ చేతీకీ బేడీలు వేసీ
పారాతో పట్టి తెచ్చీ బందికానులొ పెట్టిరీ || దొర || (పారాతో = పహరా తో)
కండ్లకూ గంతాలు గట్టీ నోటినిండా బట్లు పెట్టీ
నిలువునా నీ తలా గొట్టీ కోట బురుజుకు గట్టీరీ || దొర ||
కాసిలో నా తల్లికేమో చావు సుద్దీ తెలిసినాదీ
కన్న కడుపే తల్లటించే గంగలోనా కలిసే || దొర || (ఆ సమయంలో నరసింహా రెడ్డి తల్లి
కాశీలో ఉన్నట్లు చెబుతారు)
మూలాలు, వనరులు[మార్చు]
- పైకి దూకు↑ సుప్రసిద్ధుల జీవిత విశేషాలు - జానమద్ది హనుమచ్చాస్త్రి పేజీ 50-53