|
నెల్లూరు, ఒంగోలు క్రైం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి):‘ఖాకీ’ కక్కుర్తి పడింది! కాపాడాల్సిన కంచే చేను మేసింది. అదనపు ఎస్పీ స్థాయి అధికారి... ‘దొంగల ముఠా’ నాయకుడయ్యాడు. మావోయిస్టుల అణచివేత పేరిట తాను ఏర్పాటు చేసుకున్న ‘క్యాట్’ పార్టీలోని కానిస్టేబుళ్లనే దొంగలుగా మార్చాడు. రూ.82 లక్షల నగదు దోపిడీ చేయించి... ‘చట్టం’ చేతికి దొరికిపోయాడు. ఆ అధికారి... సమయ్ జాన్‌రావు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఓఎస్డీ (అదనపు ఎస్పీ)గా పని చేస్తున్నారు. ప్రధాన బాధ్యత మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడం, శాంతిభద్రతల పరిస్థితిని పర్యవేక్షించడం. ఇప్పుడు ఆయనే దొంగగా మారి కటకటాల్లోకి వెళ్లారు.
నెల రోజుల క్రితం... అంటే, మే 14వ తేదీన నెల్లూరు జిల్లా కావలిలో బంగారం వ్యాపారుల వద్ద సీజనల్ బాయ్‌లుగా పని చేస్తున్న వేమూరి రామయ్య, సునీల్‌లు రూ.82 లక్షలతో నవ జీవన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. వీరిని వెంబడిస్తూ... రవి, కిరణ్, శివకృష్ణ అనే ఏఆర్ కానిస్టేబుళ్లు కూడా రైలు ఎక్కారు. ‘మీ దగ్గర అక్రమ నగదు ఉంది. కావలి సీఐ వద్దకు రండి’ అంటూ తుపాకులు చూపించి హెచ్చరించారు. రామయ్య, సునీల్ చేసేదేమీ లేక... కానిస్టేబుళ్లతోపాటు కోవూరు-పడుగుపాడు వద్ద రైలు దిగారు. వీరిని కానిస్టేబుళ్లు ఓ ఆటోలో నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఓ అంబాసిడార్ కారును అద్దెకు తీసుకుని కావలి వైపు వెళ్లారు. కానిస్టేబుళ్లు మద్దూరుపాడు వద్ద రామయ్య, సునీల్‌లను కిందికి తోసేసి నగదుతో పరారయ్యారు. అయితే బాధితులు తొలుత నెల్లూరు పోలీసులకు సమాచారం అందించడం, వారు ప్రకాశంజిల్లా పోలీసులను అప్రమత్తం చేయడంతో కనిగిరి సమీపంలో నిందితులు దొరికిపోయారు. కథ సుఖాంతమైందని అంతా అనుకున్నారు. కానీ, అసలు కథ అప్పుడే మొదలైంది!
తెర వెనుక ఏఎస్పీ
దోపిడీకి పాల్పడ్డ కానిస్టేబుళ్లు, నగదు దొరికినప్పటికీ... ఈ కేసును నెల్లూరు జిల్లా పోలీసులు సీరియ్‌సగా తీసుకున్నారు. అసలు విషయంపై మరింత లోతుగా ఆరా తీశారు. నిందితులను కాపాడేందుకు మార్కాపురం ఓఎస్డీ జాన్‌రావు ‘గీత’ దాటి వ్యవహరించారనే విషయాన్ని గుర్తించారు. ‘ఎలాగూ డబ్బులు దొరికాయి కదా! వాళ్లను వదిలేయండి’ అంటూ ఎస్‌ఐ నుంచి డీఎస్పీ స్థాయి వరకు పలువురు అధికారులపై జాన్‌రావు ఒత్తిడి తెచ్చారు. ‘ఇదేదో డౌటుగా ఉంది’ అంటూ ఈ సమాచారాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీకి చేర వేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రకాశం ఏఎస్పీ బి.రామానాయక్ ఆధ్వర్యంలో గుట్టుచప్పుడు కాకుండా విచారణ జరిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో రెండు ఏఆర్ కానిస్టేబుళ్లవి కాగా, ఒక తపంచా గతంలో నక్సల్‌ను ఎన్‌కౌంటర్ చేసిన సమయంలో స్వాధీనం చేసుకున్నదని గుర్తించారు. దీంతో జాన్‌రావుపై అనుమానాలు మరింత బలపడ్డాయి. దోపిడీకి పాల్పడిన ముగ్గురు కానిస్టేబుళ్లతో అంతకుముందు జాన్‌రావు పలుమార్లు మాట్లాడినట్లు ‘కాల్ డేటా’ సహాయంతో గుర్తించారు. అసలు విషయం ఏమిటంటే... జాన్‌రావు పేరుమోసిన దొంగ నాగరాజుతోనూ చేతులు కలిపారు. ‘క్యాట్’ పార్టీలోని ముగ్గురు కానిస్టేబుళ్లతోపాటు నాగరాజుతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ఈ నలుగురే నవజీవన్ ఎక్స్‌ప్రె్‌సలో దోపిడీకి పాల్పడ్డారు. కానీ... ఆ రోజు నాగరాజు పోలీసులకు దొరకలేదు. ఆ తర్వాత కోర్టులో లొంగిపోయాడు.
‘సోమవారం ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంపై మీటింగ్ ఉంది. మీరూ రండి’ అంటూ జాన్‌రావుకు నెల్లూరు ఎస్పీ సమాచారం పంపించారు. దీంతో సోమవారం ఉదయం 10 గంటలకు జాన్‌రావు నెల్లూరుకు వచ్చారు. ఎస్పీ గజరావు భూపాల్‌తో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానంతరం ‘అరెస్టు కబురు’ చల్లగా చెప్పారు. ఆయనను కావలి కోర్టులో హాజరుపరిచి... రిమాండ్‌కు తరలించారు.
ఆది నుంచీ ఆరోపణలు
జాన్‌రావు 2007లో డీఎస్పీగా పోలీసు శాఖలో ప్రవేశించారు. ఆయనపై ఆది నుంచి అనేక ఆరోపణలు ఉన్నాయి. నంద్యాల డీఎస్పీగా పనిచేసినప్పుడు మట్కా జూదరులతో చేతులు కలిపినట్లు ఆరోపణలొచ్చాయి. 2011 డిసెంబర్‌లో మార్కాపురం ఓఎ్‌సడీగా బాధ్యతలు స్వీకరించారు. క్యాట్ పార్టీలోని ఏఆర్ కానిస్టేబుళ్లు అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్నప్పుడు ఆయనే స్వయంగా రక్షించారు. |
No comments:
Post a Comment