Tuesday, 21 June 2016

Muslim Characters in Bollywood

సలాం బాలీవుడ్
Sakshi | Updated: June 21, 2016 22:56 (IST)
సలాం బాలీవుడ్

హిందీ తెరపై ముస్లిం పాత్రలు


అద్భుతమైన ప్రేమికురాలిని చూడాలా? ‘మొఘల్-ఏ-ఆజమ్’లో ‘అనార్కలి’ కాలి గజ్జెల్లో చూడొచ్చు. గొప్ప స్నేహితుడు కావాలా? ‘జంజీర్’లో ‘షేర్‌ఖాన్’ బలమైన బాహువుల్లో చూడొచ్చు. ఆత్మాభిమానం కలిగిన కూలీని కలవాలా? ‘కూలీ’ సినిమాలో ‘ఇక్బాల్’ జబ్బకు ఉన్న 786 లెసైన్స్ బిళ్లలో చూడొచ్చు. ఈ దేశానికి పతకాలు తెచ్చి పెట్టే గొప్ప కోచ్ కావాలా? ‘చక్ దే ఇండియాలోని’ ‘కబీర్ ఖాన్’ హాకీ స్టిక్‌లో చూడవచ్చు.

బాలీవుడ్ తెరపై చూడాలేగాని ముస్లిం పాత్రలు బోలెడన్ని. ముస్లిం సంస్కృతిని ప్రదర్శించే సన్నివేశాలు బహూత్ అన్ని. 1947లో మన దేశం ఇండియా పాకిస్తాన్‌గా విడిపోయింది. దేశ విభజన సమయంలో లోతైన గాయాలు ఇరువైపులా మిగిలాయి. అయినప్పటికీ భారతీయ సినిమా ఆ గాయాల జోలికి పోకుండా ముస్లిం సంస్కృతిని తన కథలో అవిభాజ్యం చేసుకుంది. దానికి తోడు మహబూబ్‌ఖాన్, కె.ఆసిఫ్, కె.ఎ.అబ్బాస్, కమాల్ అమ్రోహి వంటి దర్శకులు... అబ్రార్ అల్వి, నాసిర్ హుసేన్, సలీమ్-జావెద్ వంటి రచయితలు... సాహిర్ లుధియాన్వి, మజ్రూ సుల్తాన్‌పురి, కైఫీ ఆజ్మీ వంటి కవులు వీరంతా ముస్లిం సంస్కృతి అవసరమైనప్పుడు తెర మీద ఎంతో హుందాగా గొప్పగా ప్రతిబింబింప చేయగలిగారు. ఇక బాలీవుడ్‌లో స్థిరపడిన అభిప్రాయం- అందమైన హీరోలంతా పంజాబ్ నుంచి అయి ఉంటారు, చక్కటి హీరోయిన్లంతా ముస్లింలై ఉంటారు అనేది అందరికీ తెలిసిందే. సురయ్య, నర్గిస్, మధుబాల (అసలు పేరు ముంతాజ్), మీనాకుమారి (అసలు పేరు మహెజబీన్) ... వీరంతా భారతీయ వెండితెరను ఏలిన తారలు.

మొఘల్-ఏ-ఆజమ్
అంతవరకూ సహాయక పాత్రలుగా, హాస్యపాత్రలుగా కనిపించిన ముస్లిలను మొఘల్-ఏ-ఆజమ్ (1960) సినిమా చారిత్రక పరంపరకు వారసులుగా చూపించింది. సలీం, అనార్కలీల ప్రేమను మహాచక్రవర్తి అయిన అక్బర్ నిలువరించడం తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ జరగడం ఇవన్నీ చరిత్రలో అనాధారితమే అయినా ఈ సినిమాతో అదంతా ప్రేక్షకులు నమ్మి తీరే కథ అయ్యింది. సలీమ్‌గా దిలీప్ కుమార్, అనార్కలిగా మధుబాల వెండితెర మీద మరణమే లేని జంటను సృష్టించగలిగారు.  ఆ తర్వాత మెల్లగా లక్నో ముస్లింల సంస్కృతి వెండి తెర మీద ఆవిష్కృతమైంది. ‘మేరే మెహబూబ్’ (1963) సినిమా ముస్లిం ప్రేమికుల కథల్లో ఉండే సౌందర్యాన్ని, కవిత్వాన్ని ప్రేక్షకులకు చూపెడితే లక్నో తవాయిఫ్‌ల జీవితాలను వ్యాఖ్యానిస్తూ వచ్చిన ‘పాకీజా’ (1971) ప్రేక్షకుల చేత జేజేలు అందుకుంది. ఈ టైమ్‌లోనే అరేబియాలో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న లైలా మజ్నూల ప్రేమ కథ ‘లైలా మజ్నూ’ (1976)గా హిందీలో విడుదలైంది. లైలాగా రంజితా, మజ్నూగా రిషికపూర్ నటించారు. ‘కోయి పత్థర్ సే నా మారే మేరే దీవానేకో’ పాట ఇందులో పెద్ద హిట్.

జంజీర్... షోలే.... కూలీ...
ఇటు ఈ తరహా సినిమాలు వస్తుంటే రచనారంగంలో సలీమ్ జావేద్‌ల రాకతో బలమైన క్యారెక్టర్స్ కనిపించడం మొదలెట్టాయి. ‘జంజీర్’ (1973)లో ఇన్‌స్పెక్టర్ అయిన అమితాబ్‌కు ప్రాణ స్నేహితుడైన పఠాన్ షేర్ ఖాన్‌గా ప్రాణ్ కనిపిస్తాడు. షోలే (1975)లో బందిపోటు గబ్బర్ సింగ్ క్రూరత్వానికి తన ముక్కుపచ్చలారని కుమారుణ్ణి బలి ఇచ్చిన గుడ్డి తండ్రి ఇమామ్ సాబ్‌గా కె.ఎ.హంగల్ చాలా గట్టిగా గుండెను తాకుతాడు. మరోవైపు దర్శకుడు మన్‌మోహన్ దేశాయ్ దేశంలో ఉన్న మూడు మతాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసే ఫార్ములాను ప్రతిపాదించాడు. అతడి ‘అమర్ అక్బర్ ఆంథోని’ (1977) సూపర్ డూపర్ హిట్. అతడే ‘కూలీ’ (1983)లో అమితాబ్‌ను ‘ఇక్బాల్’ అనే ముస్లిం పాత్రగా చేసి అతడితో పాటు ఉండే గద్దకు ‘అల్లారఖా’ అని పేరు పెట్టాడు. అమితాబ్ చేతి రైల్వే కూలీ లెసైన్సు బిళ్ల నం.786 కావడం ఈ సమయంలోనే షూటింగ్‌లో అమితాబ్ ప్రాణాపాయం వరకూ వెళ్లి బయటపడటం పెద్ద సెంటిమెంట్ సంగతి.

బాంబే... గదర్...
కాలం మారింది. బాబ్రీ మసీదు ఘటన తర్వాత కథల ధోరణి మారింది. హిందూ ముస్లింల మధ్య ప్రేమ చర్చనీయాంశం అయ్యింది. 1995లో మణిరత్నం ‘బాంబే’ సినిమా పెద్ద సంచలనం. అందులో ముస్లిం యువతి ‘సాయిరా బానూ’గా మనీషా కోయిరాలా చాలా హుందాగా కనిపిస్తుంది. మతాలు వేరైనా మనుషులూ వారి మధ్య ప్రేమ ఒక్కటే అని చెప్పే ఈ సినిమా ఆనాటి సమయంలో తీయడం పెద్ద సాహసమే అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన ‘గదర్’ (2001) భారతదేశానికి చెందిన సిక్కు ట్రక్కు డ్రైవర్‌కు పాకిస్తాన్‌కు చెందిన గొప్పింటి ముస్లిం అమ్మాయికి మధ్య నడిచిన ప్రేమ కథగా భారీ హిట్ అయ్యింది. దీనికి కొనసాగింపుగా ఇంకొంచెం సున్నితంగా యశ్‌చోప్రా ‘వీర్‌జారా’ తీశాడు. ఇందులో కూడా పాకిస్తాన్ అమ్మాయి అయిన ప్రీతి జింటా కోసం ఇండియా అబ్బాయి షారూక్ పాకిస్తాన్ వెళతాడు.

జోధా అక్బర్... మై హూనా...
హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిల ప్రేమకథ వెలితిని తీర్చడానికి చాలా భారీ స్థాయిలో వచ్చిన సినిమా ‘జోధా అక్బర్’ (2008). రాజపుత్రులకు చెందిన జోధా (ఐశ్వర్యరాయ్), మొఘలుల చక్రవర్తి అక్బర్ (హృతిక్ రోషన్) ఈ సినిమాను క్లాసిక్ స్థాయిలో నిలబెట్టారు. దీనికి కొద్దిగా ముందు క్రికెట్‌లో గొప్ప బౌలర్ కావాలని కలలు కన్న మూగ- చెవిటి పిల్లవాడు ‘ఇక్బాల్’ (2005),  ‘చక్ దే ఇండియా’ (2007)లో మహిళా హాకీ టీమ్‌ను నిలబెట్టిన కోచ్ షారూక్‌లను గొప్ప ముస్లిం పాత్రలుగా నిలబెట్టాయి. ఈ సమయంలోనే అమెరికా ప్రదర్శిస్తున్న ముస్లిం వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ షారూక్ ఖాన్ ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ (2010) తీసి ముస్లిం ఆత్మగౌరవాన్ని ప్రకటిస్తాడు.

బజరంగీ భాయ్‌జాన్...
హిందీ సినిమా ఆది నుంచి హిందూ ముస్లింల మధ్య ఒక సాంస్కృతిక వారధిగా నిలుస్తూనే ఉంది. తాజా సినిమా బజరంగీ భాయ్‌జాన్ అందుకు ఒక ఉదాహరణ. ఇందులో తప్పిపోయిన బాలికను పాకిస్తాన్‌కు తీసుకువెళ్లిన బజరంగీ (సల్మాన్‌ఖాన్)కు చాంద్ నవాబ్ అనే జర్నలిస్ట్ (నవాజుద్దీన్ సిద్దిఖీ) సాయం చేస్తాడు. మతాలు వేరైనా దేశాలు వేరైనా మానవ స్పందనలు దయ, కరుణలు ఒకటే అని నిరూపిస్తాడు.  అందరి రక్తమాంసాలు ఒకటే. పాత్రలూ ఒకటే. కాకపోతే వాటికి ఒక్కోసారి రామ్ అనీ మరోసారి రహీమ్ అని పేర్లు పెట్టుకుంటుంటాం అంతే.  - సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి

పర్‌దా హై...
ముస్లిం సంస్కృతి హిందీ సినిమాలకు ఖవ్వాలిని బహుమతిగా ఇచ్చింది. హిందీ సినిమాలలో బోలెడన్ని ఖవాలీలు హిట్స్‌గా నిలిచాయి. ‘నా తో కార్‌వాన్‌కి తలాష్ హై నా తో హమ్ సఫర్ కీ తలాష్ హై’ (బర్‌సాత్‌కీ రాత్), ‘నిగాహె మిలానె కొ జీ చాహ్‌తా హై’ (ది హి తో హై), ‘తేరి మెహఫిల్ మే కిస్మత్ ఆజ్‌మా కర్ హమ్ భి దేఖేంగే’ (మొఘల్ - ఏ- ఆజమ్)... ఇవన్నీ క్లాసిక్స్. అయితే మన్ మోహన్ దేశాయ్ అమర్ అక్బర్ ఆంథోనిలో తీసిన ‘పర్‌దా హై పర్‌దాహై’... ఖవ్వాలి చాలా పెద్ద హిట్.

No comments:

Post a Comment