ఇచ్చే వారుంటే.. ఈ దొంగకు అవార్డు గ్యారెంటీ..!!
08-07-2016 16:19:17
ఢిల్లీ: నిజమే ఇచ్చేవారుండాలి కానీ ఈ దొంగకు.. సారీ.. ఈ సూపర్ థీఫ్ అలియాస్ ఇండియన్ శోభరాజ్‌కు అవార్డు గ్యారెంటీ. ప్రస్తుతం 77 ఏళ్ల వయసున్న ఈ దొంగ తన 52 ఏళ్ల కెరీర్‌లో సినిమా స్టార్లకు ఏమాత్రం తీసిపోని విధంగా నటించాడు. జడ్జి నుంచి పోలీసు దాకా ప్రభుత్వాధికారి నుంచి నుంచి ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ వరకు ఏది అవసరమైతే ఆ వేషం వేసేసి ఎంచక్కా ప్రజలను, ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించాడు.
అతని పేరు ధనీరామ్ మిట్టల్. వయసు 77. వృత్తి దొంగతనం. కార్ల దొంగతనంలో సిద్ధహస్తుడు. వయసు మీదపడినా ఎంచక్కా నవయువకుడిలానే ఎలాంటి కారునైనా ఒక్కటంటే ఒక్క నిమిషం లోపే అన్‌లాక్ చేసి దర్జాగా దోచుకెళ్లడం అతని ప్రత్యేకత. ఢిల్లీ శివారులోని నారెల ప్రాంతంలో భార్య, కోడలితో కలిసి ఉంటున్నాడు. తండ్రి ప్రవర్తనతో విసుగు చెందిన ఇద్దరు కుమారులు అతనికి దూరంగా ఉంటున్నారు.
ధనిరామ్ తన 52 ఏళ్ల క్రితమే దొంగతనాలు మొదలుపెట్టాడు. 1964లో తొలిసారి జైలుకెళ్లాడు. తాజాగా 25వ సారి అరెస్టయ్యాడు. ఈ ఏడాదిలో తొలిసారి జూన్‌లో అరెస్టయి ఇటీవలే బెయిలుపై విడుదలయ్యాడు. అంతలోనే మరోసారి అరెస్టు కావడం గమనార్హం. గత నెలలో నాలుగు కార్లు దొంగతనం చేసినట్టు ధనీరామ్‌పై ఆరోపణలున్నాయి. తన హాఫ్ సెంచరీ కెరీర్‌లో 128 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.
లా చదువుకున్న మిట్టల్ 1960లో రోహ్‌తక్ కోర్టులో క్లర్కుగా పనిచేసేవాడు. జడ్జి రెండు నెలలు సెలవులో ఉండడంతో ఆయన స్థానాన్ని ఆక్రమించి ఏకంగా రెండు నెలలపాటు జడ్జిగా కొనసాగాడు. ఆ సమయంలో ఎందరో క్రిమినల్స్‌కు బెయిల్ మంజూరు చేశాడు. రీజనల్ ట్రాన్స్‌పోర్టు అధికారిగా వేషం మార్చి ఓసారి కారు పేపర్లను ఫోర్జరీ చేశాడు. ఆ కేసులో అరెస్టయి కోర్టులో తన కేసును తానే వాదించుకున్నాడు. తప్పుడు ధ్రువపత్రాలతో రోహ్‌తక్ రైల్వే స్టేషన్ మాస్టర్‌గానూ జాబ్ కొట్టేశాడు. ఏడాది తర్వాత విషయం బయటపడడంతో ఉద్యోగం ఊడపోయి జైలుకెళ్లాడు.
బుధవారం ఎంచక్కా ఓ కారును దొంగిలించి ఎగిరిపోతున్న మిట్టల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిమిషం లోపే కారు డోరు తాళం తెరవడాన్ని సీసీ టీవీలో చూసిన పోలీసులు నోరెళ్లబెట్టారు. 80కి చేరువవుతున్న ఈ దొంగ ఏ కార్లను పడితే ఆ కార్లను దొంగతనం చేయడు. ఎస్టీమ్, మారుతి 800, హుందయ్ శాంత్రో తదితర సెక్యూరిటీ అలారం లేని కార్లను ఎంచుకుంటాడు. ఇప్పటి వరకు 500కార్లను దొంగిలించాడు. కండిషన్‌ను బట్టి యూజ్డ్ కార్ డీలర్లకు రూ.50వేల నుంచి రూ.30 వేలకు అమ్మేస్తుంటాడు. జైలుకెళ్లిన ప్రతిసారీ అక్కడి సహచర దొంగలకు పాఠాలు బోధిస్తుంటాడు. లా లెస్సన్స్ వల్లెవేస్తాడు. నిజానికి అతనికి డబ్బుతో పనిలేదని అయినా వృత్తిని మానలేకపోతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ముదిమి వయసులోనూ ఎంతో చలాకీగా ఉంటూ దొంగతనాలకు పాల్పడుతున్న మిట్టల్‌ను చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.