Monday, 13 July 2015

'వ్యాపమ్' స్కామ్ సినిమాగా రానుందా!?

'వ్యాపమ్' స్కామ్ సినిమాగా రానుందా!?

సమాజంలో పాతుకుపోయిన లోటు పాట్లనే కథా వస్తువులుగా మలచుకుని... ప్రేక్షకులను కన్విన్స్ చేసే విధంగా తెరకెక్కించడం ప్రకాశ్ ఝాకు మాత్రమే తెలిసిన విద్య అనడంలో సందేహమేలేదు. ఆరక్షణ్, రాజనీతి, సత్యాగ్రహ, చక్రవ్యూహ్ వంటి సినిమాలను తెరకెక్కించి... విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రకాశ్ ఝా ప్రస్తుతం గంగాజల్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా పోలీస్ ఆఫీసర్ గా ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. ఇక మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో సినిమాను తెరకెక్కిస్తున్న ఈ డైనమిక్ డైరెక్టర్... పనిలో పనిగా ప్రస్తుతం దేశాన్ని ఊపేస్తున్న వ్యాపం స్కామ్ పైన దృష్టి సారించాడట.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మధ్యప్రదేశ్ వ్యాపం స్కాంపై ప్రకాశ్ ఝా ప్రత్యేకంగా దృష్టి సారించాడట. ఓ వైపు గంగాజల్ -2 షూటింగ్ లో బిజీగా గడుపుతూనే.... ఖాళీ సమయంలో స్కాంలో భాగంగా చోటుచేసుకుంటోన్న మరణాల గురించి వాకబు చేస్తున్నాడట. అయితే వ్యాపం స్కాం పైనా ప్రకాశ్ జా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడా అంటే... ఇప్పట్లో ఆ ఆలోచన లేదని అంటున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ఏమైనా వర్తమాన అంశాలను ప్రేక్షకులకు హత్తుకునేలా తెరకెక్కించడంలో మహా దిట్ట అయిన ప్రకాశ్.... ఈ స్కామ్ ను తెరకెక్కించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి వ్యాపం స్కామ్ సినిమా రూపంలో దర్శనమిస్తుందో లేదో తెలియాలంటే.. మరి కొన్నాళ్ళు నిరీక్షించాల్సిందే..!